తెలుగువారికి గోవిందుడంటే వేంకటేశ్వరస్వామే! ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురుచూసే సమయంలో భక్తుల గోవిందనామస్మరణతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అంతదాకా ఎందుకు తిరుపతిలో అడుగుపెడుతూనే ఏడుకొండలన్నీ ఆ గోవిందనామంతో మారుమోగిపోతున్నట్లు తోస్తుంది. ఇంతకీ గోవింద అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే.

గోకులంనాటి కథ
విష్ణుమూర్తిని గోవిందుడు అని కూడా పిల్చుకుంటారని తెలిసిందే. ఈ పేరు వెనుక ఓ చిన్న కథ కూడా కనిపిస్తుంది. శ్రీకృష్ణుని లీలలలో గోవర్థనగిరిని ఎత్తడం కూడా ఒకటి కదా! గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు. ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురవుతారు. గోకులం మీద తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. ఆ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రజలంతా తల్లడిల్లుతుంటే, వారిని రక్షించేందుకు గోవర్థనగిరిని తన చిటికెన వేలున ఎత్తి పట్టుకుంటాడు ఆ నల్లనయ్య.

ఈ ఘటనతో ఇంద్రుని గర్వం అణగిపోతుంది. తానే స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని, క్షమాపణలు వేడుకునేందుకు గోకులానికి వస్తాడు. అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వస్తుంది. తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా, ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అటుపై ‘నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని (అధిపతిని). కానీ మీరు గోవులన్నింటికీ కూడా అధిపతి. అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలవబడతారు,’ అని పేర్కొటాడు. అలా కృష్ణుడు ఈ భూలోకం మీద ఉన్న జీవులన్నింటికీ కూడా ఇంద్రునిగా పూజింపబడుతూ ‘గోవిందుడు’ అన్న నామంతో పూజలందుకుంటున్నాడు.
చాలా అర్థాలే ఉన్నాయి
గో అంటే గోవులు లేదా జీవులు అన్న అర్థం ఒక్కటే కాదు, అద్భుతమైన అర్థాలు ఎన్నో గోచరిస్తాయి.

విష్ణుసహస్రనామంలో
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాం గతిః |
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః
అన్న శ్లోకం కనిపిస్తుంది. ఇందులో గోవింద అనే నామాన్ని వివరిస్తూ పెద్దలు గో అనే శబ్దానికి గోవులు, భూమి, వాక్కు, వేదాలు అనే అర్థాలు ఉన్నాయని చెబుతారు. అంటే యోగులు విష్ణుపరమాత్మను ఈ లోకానికీ, ఆ లోకం మీద ఉండే జీవులకూ ప్రాణాధారంగా భావిస్తున్నారని తెలుస్తోంది. మరి అలాంటి జీవంతో సంచరించే మనిషికి ఆరోగ్యంతో పాటుగా జ్ఞానం (వేదం) ఉండాలి. మంచిని వ్యాపింపచేసి చెడుని ఖండించే వాక్కు ఉండాలి. అంటే మనకు జీవాన్ని, ఆ జీవానికి పోషణగా నిలిచే లోకాన్ని, ఆ జీవానికి అర్థాన్నిచ్చే వాక్కునీ, తనేమిటో తెలుసుకుని పరమాత్మతో ఐక్యమయ్యేందుకు తోడ్పడే జ్ఞానాన్ని... ప్రసాదించేవాడే ‘గోవిందుడు’ అనుకోవచ్చు. బహుశా అందుకేనేమో శంకరాచార్యులరు ‘భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే’ అంటూ ఆ పరమత్మను తలచుకోమని హెచ్చరించారు