Hayagriva Jayanthi / Mangala Gauri Vrat in Telugu - మంగళ గౌరీ వ్రతము / హయగ్రీవ జయంతి

శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకునే హయగ్రీవ జయంతి మరియు శ్రావణ మంగళ వారములు ఆచరించే (నాలుగు వారములు) మంగళ గౌరీ వ్రతముల వెనుక చాల కథలు, అర్థాలు ఉన్నాయి.

మానవ కళ్యాణము కోసం భగవంతుడు ఎన్నో లీలలు చేస్తుంటాడు. అవతారాలు ఎత్తుతుంటాడు. అయితే అలా చెయ్యడానికి కారణాలు, మార్గాలు కూడా తానే సృష్టించుకుంటుంటాడు.

హయగ్రీవ అవతారం కూడా అలాంటిదే. దానితో పాటు మంగళ గౌరీ వ్రతం కూడా తానే ఏర్పాటు చేసుకున్నాడు.

హయగ్రీవ అవతారము
రాక్షసులు మితిమీరి దుండగలు చేయ సాగారు. భగవంతుడుని పూజించడం, పూజలు పునస్కారాలు చేయడం వల్ల తమకు హాని కలుగుతోంది అని అసలు వేదాలనే హరించేస్తే అందరూ పూజలు మర్చి పోతారని చాలా సార్లు వేదాలని దొంగిలించడమూ మళ్ళీ వాటిని భగవంతుడు ఏదో విధంగా కాపాడడమూ జరుగుతూ వచ్చాయి.

ఈ సారి రాక్షసుడు గుర్రం రూపంలో వాటిని దొంగిలించి పారిపోయాడు. అప్పుడు బ్రహ్మ మళ్ళీ వెళ్లి విష్ణు మూర్తి శరణు జొచ్చాడు. విష్ణు మూర్తి ఈ సారి పెర్మనెంట్ సొల్యూషన్ వెదికాడు. బ్రహ్మని పంపించేసి తాను వ్యూహం రచించాడు.

లక్ష్మీ దేవికి కోపం వచ్చేలా ప్రవర్తించి ఆమెతో శాపం తీసుకున్నాడు తల తెగి పోయేట్లా.
మళ్ళీ తనే దానికి విరుగుడు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తల తెగగానే గుఱ్ఱపు ముఖము ఒకటి తెచ్చి తనకి అతికించేలా. తాను హయగ్రీవ మూర్తి అయ్యాడు.
ఆ రూపంలో వెళ్లి ఆ రక్కసుని సంహారించి వేదాలని తెచ్చాడు.
కాని అలా చేస్తే మళ్ళీ బ్రహ్మ వాటిని పారేసుకుంటాడని ఆలోచించి తిన్నగా వేదాలనే బ్రహ్మ బట్టీ పట్టే లాగా ఆ అవతారంలోనే అతనికి భోధించి వేద జ్ఞానాన్ని శాశ్వతం చేశాడు.

అప్పటి నుండి విష్ణు మూర్తిని హయగ్రీవ మూర్తిగా కూడ పూజించడం మొదలెట్టారు. హయగ్రీవ మూర్తి జ్ఞానాలను ప్రసాదించే మూర్తిగా పూజింపబడుతున్నాడు.

హయగ్రీవ స్వామిని ముఖ్యంగా అక్షరాభ్యాసం, ఏమైనా పెద్ద పరీక్షలు కట్టేటప్పుడు, లేదా మామూలుగా ప్రతిరోజూ జ్ఞానము వెలుగు చూపించమనీ ఆరాధించవచ్చును. హయగ్రీవ స్వామి అష్టోత్తరం చదివి పూజించవచ్చు లేదా వట్టి "జ్ఞానానందమయం" శ్లోకం చదివినా చాలు.

శ్లోకము:
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్ |
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||

అర్థము:
జ్ఞానము, ఆనందములతో నిండిపోయి నిర్మలమైన స్ఫటికము వలె ప్రకాశించుచున్న దైవమా, సకల విద్యలకు ఆధారమైన హయగ్రీవ స్వామీ, మిమ్మల్నే శరణు వేడుకుంటున్నాను. (నాకు జ్ఞానం ప్రసాదించి ఉద్ధరించుమా).

మంగళ గౌరీ వ్రతము
ఇక మంగళ గౌరీ వ్రతం గురుంచి చెప్పుకుందాము.

లక్ష్మీ దేవి తన పొరపాటుకి చింతిస్తూండగా దేవతలూ బ్రహ్మ కలిసి గౌరీ దేవిని పూజించి ఆమె కటాక్షము తో మరల విష్ణువు లక్ష్మి దేవిని జేరుకున్నట్లుగా అంతా విష్ణువే సృష్టించెను. లక్ష్మి దేవి మహదానందం తో ఆ మంగళవారం నాడు ఎవరైతే గౌరీ దేవిని పూజిస్తారో వాళ్ళకి సౌభాగ్యము, ఇంకా కోరిన కోరికలన్నీ కూడా తీరేట్లాగా వరమిచ్చింది.
అప్పటినుండి అందరూ శ్రావణ మాసంలో గౌరీ వ్రతం చేయడం మొదలు పెట్టారు. మంగళవారం నాడు చేస్తున్నారు గనుక దానికి మంగళ గౌరీ వ్రతం అనీ, అదీ కాక శ్రావణ మాసంలో చేస్తున్నారు గనుక శ్రావణ మంగళ గౌరీవ్రతం అనీ పేర్లు వచ్చాయి.

ఈ మంగళ గౌరీ వ్రతం ఒక నోము లాగ మొత్తం శ్రావణ మాసంలోని అన్ని మంగళవారములు చేయవచ్చును లేదా ఒకసారి అయినా కనీసం చేస్తే మంచి జరుగుతుంది. గౌరీ దేవిని నామాల తోనూ, స్తోత్రాలతోను, పసుపు, కుంకుమ, పూల తోనూ పూజించి ప్రసన్నురాలిని చేసుకుని ఆమె కటాక్షము తో సకల సౌభాగ్యములూ పొందవచ్చును.

ఈ విధంగా దేవుడు ఎప్పటికప్పుడు అవసరమైనప్పుడల్లా అవతార మెత్తుతూ మానవజాతిని రాక్షసుల నుండి కాపాడుతూ లోక కళ్యాణ మొనరించుచున్నాడు.

ఇవన్నీ కూడా ఆడ మగా తారతమ్యం లేకుండా ఎవరైనా సరే తమ పూర్తి కుటుంబ సంక్షేమం కోసం చేయవచ్చును.

పురుషుడు, స్త్రీ, ఇద్దరూ కూడా బండికి రెండు చక్రాల లాంటి వారు. ఇద్దరూ ఒకే దిశగా నడుస్తూ జీవిత మనే బండిని ఒద్దికగా గమ్యానికి జేర్చాలి.